Friday, October 4, 2024
HomeUncategorizedగోవాలో ఈ బీచ్ వెళ్లాలంటే రిజర్వేషన్

గోవాలో ఈ బీచ్ వెళ్లాలంటే రిజర్వేషన్

Date:

చాలామంది గోవాకు సేద తీరడానికి వెళ్తారు. దేశ, విదేశాల నుండి కూడా ఎంతో మంది గోవాకు వస్తుంటారు. అయితే గోవాలో పర్యాటకుల తాకిడితో తలెత్తుతున్న సమస్యలను కట్టడి చేయడానికి ఉత్తర గోవాలోని కలంగుట్‌ పంచాయతీ చర్యలు చేపట్టింది. రిజర్వేషన్లు లేకుండా అక్కడికి వచ్చి గ్రామ పరిసరాలను చెత్తగా మారుస్తున్న పర్యాటకులను కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం వారి నుంచి అదనపు పన్ను వసూలు చేయాలని నిర్ణయించుకొంది.

కలంగుట్‌లో ఈనెల మొదట్లో జరిగిన పంచాయతీ మీటింగ్‌లో దీనిపై చర్చించారు. పబ్లిక్‌ న్యూసెన్స్‌, చెత్త వేయడం, ఇష్టారాజ్యంగా పార్కింగ్‌, బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడం వంటి అంశాలపై చర్చించారు. ”పర్యటకులు బృందాలుగా బస్సులు, జీపుల్లో వస్తుంటారు. వారు సముద్ర తీర పరిసరాల్లో మద్యం తాగుతున్నారు. అక్కడే వాహనాల్లో వంటలు చేసుకొని చెత్తను ఆ గ్రామ పరిసరాల్లో పారేస్తున్నారు. ఇక్కడ ఉండటానికి వారు హోటళ్లలో ఎలాంటి రిజర్వేషన్లు చేసుకోవడం లేదు. అందుకే గ్రామానికి వచ్చే ఐదు మార్గాల్లో చెక్‌పాయింట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించాము. రిజర్వేషన్లు లేకుండా వచ్చే రోడ్‌ ప్యాసింజర్‌పై పన్ను విధించాలని తీర్మానించాం. వారి బాధ్యతారాహిత్య ప్రవర్తనను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నాం” అని గ్రామ సర్పంచి జోసఫ్‌ సెకీరియా పేర్కొన్నారు. పర్యటకులు మద్యం తాగిన సీసాలను ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారన్నారు. రోజు మొత్తం అక్కడే వాహనాలను నిలిపి ఉంచడం, పబ్లిక్‌ టాయిలెట్లు వాడుకోవడం వంటివి సమస్యాత్మకంగా మారాయని పంచాయతీ తీర్మానంలో పేర్కొన్నారు.

ఇప్పటికే పర్యటకులు గ్రామంలోకి వచ్చే ఐదు మార్గాలను పంచాయతీ సిబ్బంది గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మార్గాల్లో పోలీసులతో చెక్‌ పోస్టులు ఏర్పాటుచేయించాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసేందుకు పంచాయతీ పాలకవర్గం ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీ సిబ్బంది కూడా అక్కడ పని చేసేలా సన్నాహాలు చేసింది.