Wednesday, September 25, 2024
HomeUncategorizedకొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌

కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌

Date:

కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే.. కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ పేర్లను బయటపెట్టారు. ఈసీలుగా మాజీ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు మీడియాకు వెల్లడించారు. నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది. అనంతరం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇందులో అధిర్‌తో పాటు కేంద్రహోం మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు.

ఈ భేటీ అనంతరం అధిర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ”కమిటీలో ప్రభుత్వానికే మెజార్టీ ఉంది. తొలుత నాకు 212 పేర్లను పంపించారు సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారు. చివరకు పంజాబ్‌కు చెందిన సంధూ, కేరళకు చెందిన జ్ఞానేశ్‌ను ఎంపిక చేశారు. ఇది ఏకపక్షమని నేను చెప్పను. కాకపోతే ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ సభ్యులుగా ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు. గత నెల ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ‘కేంద్ర ఎన్నికల కమిషనర్‌’ (సీఈసీ), ‘ఎన్నికల కమిషనర్‌’ (ఈసీ)ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం (మార్చి 15) విచారణ జరపనుంది.