ప్రకృతి విలయానికి అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తమిళనాడు ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సీఎం నిధుల కింద రూ.5 కోట్లు విడుదల చేయాలని అధికారులను స్టాలిన్ ఆదేశించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 63 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన స్టాలిన్.. కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రకృతి ప్రకోపానికి గురై విలవిల్లాడుతున్న కేరళ ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఇద్దరు ఐఏఎస్ కేడర్ల నేతృత్వంలో రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు. ఆ టీమ్‌ను కేరళకు పంపిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 10 మంది వైద్యులు, నర్సులతో కూడిన ఓ వైద్య బృందాన్ని కూడా కేరళ రాష్ట్రానికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు వయనాడ్ విలయంపై కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ విపత్కర పరిస్థితుల్లో కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా సాయమందిస్తామని హామీ ఇచ్చారు.