Wednesday, October 9, 2024
HomeUncategorizedకేంద్ర ప్రభుత్వం అప్పు రూ.185 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.185 లక్షల కోట్లు

Date:

విదేశీ రుణాల‌తో క‌లుపుకొని ప్ర‌స్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.185 లక్షల కోట్లకు చేరనుంది. ప్రస్తుత ధరల వద్ద ఈ మొత్తానికి చేరొచ్చని కేంద్రం అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో 56.8 శాతానికి సమానమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి వెల్లడించారు. 2024 మార్చి చివరి నాటికి కేంద్రం అప్పు రూ.171.78 లక్షల కోట్లుగా ఉందని పంకజ్‌ చౌధరి వెల్లడించారు. జీడీపీలో ఈ మొత్తం 58.2 శాతానికి సమానమని పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వరల్డ్‌ ఔట్‌ లుక్ ప్రకారం.. 2024 ఏప్రిల్ నాటికి స్థిర ధరల వద్ద దేశ జీడీపీ 3.57 ట్రిలియన్‌ డాలర్లు దాటిందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2014ను అనుసరించి వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.2100 కోట్లు సాయం అందించాలని నీతి ఆయోగ్‌ సూచించిందని పంకజ్‌ చౌధరి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక్కో జిల్లాకు రూ.300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ఇప్పటి వరకు రూ.1750 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రత్యేక సాయం కింద కొన్ని రాష్ట్రాలకు ఈ తరహాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లను బడ్జెట్‌లో అందజేస్తుందని చెప్పారు.