Wednesday, September 25, 2024
HomeUncategorizedకాంగ్రెస్-బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలు

కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలు

Date:

రాష్ట్ర పాలకుల అవినీతి డిల్లీ వరకు చేరిందని, బీఆర్ఎస్, కాంగ్రెసు కలసి ఉన్నాయని, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెసు పాలకులు మౌనం వహిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని, తెలంగాణ రాష్ట్ర వికాసం కోసం బిజెపికి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో కవిత అరెస్టుపై మొదటిసారి స్పందించిన మోడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కెసిఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు కలసి పనిచేస్తున్నాయని, రెండూ అవినీతి పార్టీలనీ, కుటుంబ పార్టీలనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. అవినీతి పార్టీలను తిరస్కరించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. దేశ అభివృద్ధి కోసం తాను నిరంతరం పరిశ్రమిస్తానని, కుర్చీ కోసం చూడకుండా ప్రజలకు లబ్ది చేకూర్చే నిర్ణయాలనే తాను తీసుకుంటానని మోడీ చెప్పారు.

తెలంగాణ అభివృద్ధి కోసం గ్యారంటీ ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన ఎవ్వరినీ తాను ఒదిలి పెట్టబోనని కూడా మోడీ హామీ ఇచ్చారు. జగిత్యాల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే తాను, తీసుకుంటానని మోడీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు శక్తి పేరిట చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, ప్రతి మహిళలో, బాలికలో తాను శక్తిని దర్శిస్తానని, దేశంలో భారతమాత శక్తిని చూస్తానని వివరించారు. ప్రతిపక్షాల ‘శక్తి’ ఆరోపణల సవాలును తాను స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎవరైనా శక్తిని ఎలా నాశనం చేస్తారని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవం మొదలయిందనీ చెబుతూ, ఈ నెలలోనే 5 సార్లు రాష్ట్రంలో పర్యటించినట్లు, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి చేరుతోందని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్ళలో తెలంగాణాలో జరగాల్సినంత అభివృద్ధి చెందలేదని ఆరోపించారు.

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెసు మాట్లాడటం మానేసిందని చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి నూంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులనుమోదీ ప్రజలకు పరిచయం చేశారు. ట్విటర్ పై నమో -తెలుగు అకౌంటు కు వెళ్ళి తనతో తెలుగులో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. వాటిలో లోపాలను చెప్పి తెలుగు నేర్చుకోవటంలో తనకు సాయం చేయాలని మోదీ కోరారు. రైతులు, యువతులు, మహిళలు, పేదల సంక్షేమంకోసం తాము చేస్తున్న కృషిలో కలసి రావాలని ప్రజలను కోరారు. AI తో తన సంభాషణాలు, ప్రసంగాలను నమో- తెలుగు ఆప్ లో వినాలని కోరారు.