Saturday, September 21, 2024
HomeUncategorizedకాంగ్రెస్‌ పార్టీవి కాలం చెల్లిన సిద్ధాంతాలు

కాంగ్రెస్‌ పార్టీవి కాలం చెల్లిన సిద్ధాంతాలు

Date:

కాంగ్రెస్‌పార్టీవి కాలం చెల్లిన సిద్ధాంతాలని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాని బుధవారం రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో నా ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. వారు నా మాటలు వినేందుకు సిద్ధంగా లేరని తెలుసు. విపక్షాల దుస్థితికి కాంగ్రెస్సే జవాబుదారీ. ఆ పార్టీవన్నీ పనికిరాని ఆలోచనలు. ఉత్తరం, దక్షిణం పేరుతో దేశాన్ని విడదీయాలని చూస్తున్నారు. మన దేశ భూభాగాల్లో చాలా వరకు కాంగ్రెస్‌ శత్రువులకు అప్పగించింది. మన సైన్యం ఆధునికీకరణను నిలిపివేసింది. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది. అలాంటి కాంగ్రెస్‌ జాతీయ భద్రత గురించి మాకు పాఠాలు చెబుతోంది” అని ప్రధాని మండిపడ్డారు.

కాంగ్రెస్‌లో వారి నాయకులు, విధానాలకే ఎలాంటి గ్యారంటీ లేదు. అలాంటి వారు మోడీ గ్యారంటీలను ప్రశ్నిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వారికి కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పనిచేసింది. మాజీ ప్రధాని నెహ్రూను వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. మా హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చాం. తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసింది ఎన్డీయే ప్రభుత్వం. కాంగ్రెస్‌ పాలకులు వారి కుటుంబీకులకు మాత్రమే అత్యున్నత పురస్కారాలను అందించారు. 1990లో కేంద్రంలో మా మద్దతుతో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ‘భారతరత్న’తో సత్కరించింది” అని మోడీ గుర్తుచేశారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌ నుంచి కాంగ్రెస్‌కు ఓ సవాల్‌ (మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) ఎదురైంది. హస్తం పార్టీ 40 స్థానాలు కూడా సాధించలేదని అన్నారు. కనీసం మీరు 40 సీట్లైనా గెలవాలని నేను కోరుకుంటున్నా” అని ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఇటీవల ఖర్గే చేసిన ప్రసంగాన్ని కూడా ప్రస్తావించారు. ”వచ్చే ఎన్నికల్లో మాకు 400 సీట్ల మెజార్టీ వస్తుందని ఖర్గే అంచనా వేశారు. అది మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నా. కచ్చితంగా ఆయన అంచనా నిజమవుతుంది. ఆరోజు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా లభించిందని నేను ఆశ్చర్యపోయా. బహుశా ఆ రోజు వారి స్పెషల్‌ కమాండర్లు ఇద్దరు (కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ను ఉద్దేశిస్తూ) ఆ రోజు సభకు రాలేదేమో” అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని విమర్శల వర్షం కురిపించారు. ”కాంగ్రెస్‌ పార్టీ పదే పదే ఒకే ఉత్పత్తి (రాహుల్‌ను ఉద్దేశిస్తూ)ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం మూతబడుతోంది. వారు తమ యువరాజును స్టార్టప్‌గా తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, ఆయన ఎప్పటికీ స్టార్ట్‌ కాడు” అని ఎద్దేవా చేశారు.