Tuesday, September 24, 2024
HomeUncategorizedకాంగ్రెస్ నేతల అవినీతి జాబితా పంపిస్తా

కాంగ్రెస్ నేతల అవినీతి జాబితా పంపిస్తా

Date:

తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌, ఎంఐఎం.. మూడు పార్టీల అజెండా ఒక్కటే అంటూ కీలక ఆరోపణలు చేశారు. మూడు పార్టీలు వ్యూహాత్మకంగా కలిసే పనిచేస్తున్నాయని.. వాళ్ల ప్రధాన లక్ష్యం బీజేపీని, మోడీని ఓడించడమేనని చెప్పుకొచ్చారు. మజ్లిస్ పార్టీ చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు కీలుబొమ్మలుగా మారాయంటూ అమిత్ షా కీలక ఆరోపణలు చేశారు.

కుటుంబాల చేతిలో ఉన్న పార్టీలు ఎప్పటికీ ప్రజా శ్రేయస్సును ఆకాంక్షించవంటూ అమిత్ షా తెలిపారు. వారు వారి కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతటి అవినీతికైనా సిద్ధపడుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి.. కాంగ్రెస్ నేతల అవినీతి జాబితా పంపిస్తానని అమిత్ షా ప్రకటించారు. ఆ జాబితాపై సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీపై విమర్శలు చేయాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమారు 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పగలడా అంటూ అమిత్ షా ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజలంతా మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని జోస్యం చెప్పారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అయితే.. ఈ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పని చేస్తున్నామని.. ఇందులో భాగంగా తెలంగాణలో 12కు పైగా ఎంపీ సీట్లు గెలవాలని అమిత్ షా సూచించారు.