Saturday, September 28, 2024
HomeUncategorizedకవిత సిబిఐ విచారణపై అందుకే

కవిత సిబిఐ విచారణపై అందుకే

Date:

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవితని విచారించడానికి సిబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు సిబిఐ అధికారులకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. ఇక కవిత సీబీఐ విచారణ పట్ల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీబీఐ విచారణలో గోప్యతకు భంగం కలగదు 

కవితను ఇదే సమయంలో సిబిఐ విచారించవలసిన అవసరాన్ని ఆయన తనకున్న అనుభవంతో వివరించారు. కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నందున ఆమెను విచారించాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి కాబట్టి సిబిఐ కోర్టు అనుమతితో కవితను విచారించడానికి సిద్ధమైందన్నారు. ఇక సిబిఐ అధికారులు మహిళ అయిన కవితను విచారించే క్రమంలో అక్కడ మహిళాఅధికారులు ఉంటారని విచారణ ఎదుర్కొనేవారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా అక్కడ మహిళా కానిస్టేబుల్స్ ఉంటారని తెలిపారు.

అందుకే సీబీఐ త్వరపడింది..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడి మనీ లాండరింగ్ గురించి దర్యాప్తు చేస్తే సిబిఐ అందులో జరిగిన అవినీతి గురించి, ఎవరి పాత్ర ఏంటి అన్నదాని గురించి దర్యాప్తు చేస్తుందన్నారు. తమ పరిధి మేరకే సిబిఐ కేసులో చార్జిషీట్ దాఖలు చేస్తుందని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తెలిపారు. కవిత తన కుమారుని పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే సిబిఐ విచారణకు త్వరపడినట్లుగా సిపిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బెయిల్ వస్తే విచారించడం కష్టం

కవితకు బెయిల్ వస్తే విచారించడం కష్టంగా మారుతుందని భావించి, జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగుతున్న సమయంలోనే సిబిఐ కూడా అడుగులు వేసింది అన్నారు. కుమారుడి పరీక్షల నిమిత్తం బెయిల్ కోరిన కవితకు కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని అయితే కోర్టు తాత్కాలికంగానే బెయిల్ ఇవ్వచ్చని, బెయిల్ పై బయటకు వచ్చిన సమయంలో సాక్షులను ప్రభావితం చేయరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈడీ బెయిల్ రాకుండా ప్రయత్నం

ఈడీ ఇటువంటి కేసులలో నిందితులకు బెయిల్ రాకుండా ఉండాలని ప్రతి 15 రోజులకు ఒకసారి రిమాండ్ ను పెంచడానికి ప్రయత్నం చేస్తారని, కవిత విషయంలోను ఈడీ బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తుందని అన్నారు. అయితే సిబిఐ, ఈడి అధికారులు విచారణ చేసినంత మాత్రాన కవిత చుట్టూ ఉచ్చుబిగుస్తుంది అని చెప్పలేమని, ఆమెపై మోపబడిన ఆరోపణలు, సేకరించిన ఆధారాలు కోర్టులో నిలబడితేనే తప్ప చెప్పలేమన్నారు.