Sunday, October 6, 2024
HomeUncategorizedకదిలిన పూరీ జగన్నాథ రథచక్రాలు..

కదిలిన పూరీ జగన్నాథ రథచక్రాలు..

Date:

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హజరయ్యారు. రథయాత్రను వీక్షించేందుకు భారీగా తరలిరావడంతో పూరీ పట్టణం జనసంద్రంగా మారింది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా… పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు వేడుకలు ఈరోజే ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్‌ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. స్వామిసేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యలో నిలిపివేస్తారు. మళ్లీ సోమవారం భక్తులు రథాలను లాగుతారు.

రథయాత్రకు హాజరైన రాష్ట్రపతి ముర్ము..

పూరీ రథయాత్రకు గతంలో రాష్ట్రపతులెవరూ రాలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్‌ రఘుబర్‌దాస్‌తో కలిసి రాష్ట్రపతి.. సుభద్రమ్మ రథం లాగారు. ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రెండురోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు.