Sunday, October 6, 2024
HomeUncategorizedకజిరంగ నేషనల్‌ పార్క్‌కు భారీ వరద..

కజిరంగ నేషనల్‌ పార్క్‌కు భారీ వరద..

Date:

అస్సాంలో వరద బీభత్సం కారణంగా కజిరంగ జాతీయ పార్కు తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో సుమారు 131 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన జంతువుల్లో ఆరు ఖడ్గమృగాలు, 117 హాగ్‌ జింకలు (ఇందులో 98 నీట మునిగి ప్రాణాలు కోల్పోగా.. రెండు జింకలు వాహనాలు ఢీకొట్టి చనిపోయాయి. మరో 17 జింకలు చికిత్స సమయంలో ప్రాణాలు కోల్పోయాయి), రెండు సాంబార్‌, ఒక ఒట్టర్‌ సహా మొత్తం 131 వన్య ప్రాణాలు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా మరికొన్ని హాగ్‌ జింకలు, రెండు ఖడ్గమృగాలు, సాంబార్‌ జింకలు, స్కాప్స్‌ గుడ్లగూబలు, చిత్తడి జింకలు, కుందేలు, ఒట్టర్‌, ఏనుగు సహా మొత్తం 97 జంతువులను అధికారులు రక్షించారు. ప్రస్తుతం 25 జంతువులు వైద్య సంరక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 52 జంతువులను చికిత్స తర్వాత సురక్షిత ప్రాంతంలో వదిలినట్లు పేర్కొన్నారు.

పార్క్‌లో వరద పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నీటిలో ఓ ఖర్గమృగం చిక్కుకున్న వీడియోని ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. వదర నీటిలో చిక్కుకుని ఒంటరిగా ఉన్న ఈ ఖడ్గమృగాన్ని గమనించినట్లు చెప్పారు. వెంటనే దాన్ని రక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలు మానవులను, జంతువులను ఒకేలా ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సాయం చేసేందుకు సహాయక బృందాలు 24 గంటలూ శ్రమిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.