Tuesday, September 24, 2024
HomeUncategorizedఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా సీఏఏ

ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా సీఏఏ

Date:

ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా కేంద్రం సీఏఏను అమల్లోకి తెచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇదో మురికి ఓటు బ్యాంకు రాజకీయం. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వలసదారులకు పౌరసత్వం ఇచ్చి వారికి బిజెపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆశ్రయం కల్పిస్తుంది. దీనివల్ల భవిష్యత్‌లో బిజెపికి ఓటు బ్యాంకు పెరుగుతుంది. వారి రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.

ఇప్పటికే దేశంలో ఉన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించకుండా కేంద్రం సీఏఏ గురించి మాట్లాడుతోంది. 2014కు ముందు భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామంటున్నారు. కాని ఒకసారి తలుపులు తెరిచిన తరువాత మిగిలినవారు ఊరుకుంటారా… పెద్ద సంఖ్యలో వలసదారులు భారతదేశంలోకి రావడం ప్రారంభిస్తారు. మూడు దేశాల్లో 30 మిలియన్లకు పైగా మైనారిటీలు నివసిస్తున్నారు. 15 మిలియన్ల మంది భారత్‌కు వచ్చినా వారు ఎక్కడ స్థిరపడతారు, వారికి ఉద్యోగాలు ఎవరు ఇస్తారు. ఇది దేశానికి ప్రమాదకరం. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ప్రభావితం అయ్యే అవకాశముందన్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసదారులు రావడం వల్ల అస్సాం ప్రజల భాష, సంస్కృతి ఇబ్బందుల్లో పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

వలసదారులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల దేశంలోని యువతకు అందాల్సిన ఉద్యోగావకాశాలు వారికి దక్కుతాయి. వారికి ఉద్యోగాలు ఇస్తారు, ఇళ్ళు కట్టిస్తారు. మరి మన దేశ పౌరుల పరిస్థితేంటి అని కేజ్రీవాల్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. పాకిస్థానీయులను మన దేశంలో స్థిరపరచడానికి బిజెపి ప్రయత్నస్తోందని దుయ్యబట్టారు. మన దేశ అభివృద్ధికి ఉపయోగించాల్సిన ప్రభుత్వ డబ్బును కేంద్రం పాకిస్థానీయుల స్థిరీకరణకు ఖర్చు చేయాల్సి వస్తుందని విమర్శించారు.