Sunday, September 22, 2024
HomeUncategorizedఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం

Date:

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్‌ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ ఆరంభంలో (18వ నిమిషం) స్పెయిన్‌ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. దానిని హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు.

వెంటనే మరో పెనాల్టీ కార్నర్‌ లభించగా భారత్‌ దానిని సద్వినియోగం చేసుకుంది. ఈ సారి హర్మన్‌ప్రీత్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతి గోల్‌ పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు. మూడో క్వార్టర్‌ మొదలైన కాసేపటికే పెనాల్టీ కార్నర్‌తో హర్మన్‌ప్రీత్‌ మరో గోల్‌ చేశాడు. దీంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మూడు పెనాల్టీ కార్నర్‌లు సాధించిన ఇండియా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. మ్యాచ్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా స్పెయిన్‌కు ఓ పెనాల్టీ కార్నర్‌ లభించింది. భారత గోల్‌ కీపర్‌ శ్రీజేశ్ దానిని అద్భుతంగా అడ్డుకున్నాడు. 60వ నిమిషంలో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్‌ రాగా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒలింపిక్స్‌లో భారత్ 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది. 2020 టోక్యో ఒలిపిక్స్‌లోనూ భారత్‌ కాంస్యం గెలిచింది. అంతకుమందు 1968, 1972లో టీమ్ఇండియా కంచు మోగించింది.