నీట్-2024 ఫలితాల్లో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీకైందన్న ఆమె… ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
మరోవైపు నీట్ ఫలితాల వెల్లడి తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై ప్రియాంక దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ” లక్షలాది మంది విద్యార్థుల గోడును ఈ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది. నీట్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పదేపదే మొత్తుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. దర్యాప్తు చేపట్టి వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?” అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. నీట్ పరీక్ష ఫలితాలపై పలువురు అభ్యర్థులు, తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే.