Saturday, September 28, 2024
HomeUncategorizedఏ కోర్టు ఐనా ముఖ్యమంత్రిని తొలగించిందా..?

ఏ కోర్టు ఐనా ముఖ్యమంత్రిని తొలగించిందా..?

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ ఆప్‌ మాజీ ఎమ్మెల్యే సందీప్‌కుమార్ ఢీల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విధుల్ని నిర్వర్తించలేని పరిస్థితిలో సీఎం ఇప్పుడు ఉన్నారని, జైలు నుంచి ఆయన పనిచేయడం సాధ్యం కాదని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఏ అధికారం ప్రకారం ఆయన కొనసాగుతున్నారో ప్రశ్నించి, పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఇప్పటివరకు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ముఖ్యమంత్రిని తొలగించిందా..? అలాంటి ఉదాహరణ ఉంటే మాకు చూపించండి. ఈ అంశంపై విచారిస్తోన్న మూడో పిటిషన్ ఇది. సీక్వెల్స్‌ ఉండటానికి ఇది జేమ్స్‌బాండ్ చిత్రం కాదు. తొలగింపు అంశంపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ రాజకీయ ప్రసంగాలు చేయకండి. రాజకీయ కుట్రలో మమ్మల్ని ఇరికించకండి. ఈ వ్యవస్థను అపహాస్యం చేయొద్దు. మీపై భారీ జరిమానా విధించనున్నాం” అని మందలించారు.

రెండురోజుల క్రితం ఇదే పిటిషన్‌ను జస్టిస్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌ విచారించారు. ఇది కేవలం ప్రచారాన్ని ఆశించి వేసినట్లు ఉందని, దానికిగానూ కోర్టు ఖర్చు రూపంలో భారీగా వడ్డించాలని వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే ఈ అంశంపై రెండు పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించి, తీర్పు వెలువరించిన తర్వాత దీనిని వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అదే ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాజా విచారణ జరిగింది.