Saturday, September 28, 2024
HomeUncategorizedఎన్నికల తర్వాతే 'ఇండియా' కూటమి ప్రధాని

ఎన్నికల తర్వాతే ‘ఇండియా’ కూటమి ప్రధాని

Date:

ప్రస్తుతం తాము సైద్ధాంతికంగా పోరాడుతున్నామని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు, వాటిని రక్షించే శక్తుల మధ్యే తాజా పోరు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే విపక్షాల కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ సమాధానమిచ్చారు.

”2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ‘భారత్‌ వెలిగిపోతోందంటూ’ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. అప్పుడు కాషాయ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. ఈ ఎన్నికలు ఏకపక్షం అంటూ బయట ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. విపక్షాల ‘ఇండియా’ కూటమి సైద్ధాంతిక పోరు చేస్తోంది. ఇందులో కూటమిదే విజయం. ఎన్నికల తర్వాతే ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం” అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

‘న్యాయ్‌పత్ర’ పేరుతో కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు తెలిపింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా, అగ్నిపథ్‌ పథకం రద్దు, జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, రైట్‌ టూ అప్రంటీస్‌ చట్టం, విద్యా రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు వంటి హామీలను కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.