Friday, September 20, 2024
HomeUncategorizedఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

Date:

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సూచికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఆమె ఇందులో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీనితో సంప్రదాయబద్దమైన సెంగోల్‌తో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేశారు. ఈ పదేళ్ల కాలంలో సాధించిన విజయాల గురించీ వివరించారు.

10 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా వేలాది గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామని, రోడ్ కనెక్టివిటీని ఇచ్చామని ద్రౌపది ముర్ము అన్నారు. లక్షలాది గిరిజన కుటుంబాలకు ఇప్పుడిప్పుడే పైప్‌లైన్ల ద్వారా మంచినీటిని అందిస్తోన్నామని చెప్పారు. గిరిజన గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ కనెక్టివిటీని తీసుకొస్తోన్నామని పేర్కొన్నారు.

దేశ ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తోన్న అనేక జాతీయ ప్రయోజనాలకు వాస్తవ రూపాన్ని కల్పించామని ద్రౌపది ముర్ము చెప్పారు. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తోన్న రామ మందిర నిర్మాణాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చామని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు స్వేచ్చను ప్రసాదించామని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని, దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించామని రాష్ట్రపతి చెప్పారు. ఈశాన్య ప్రాంతానికి రికార్డు స్థాయిలో పర్యాటకులు చేరుకుంటోన్నారని, దీనికి కారణం- తాము అనుసరిస్తోన్న పర్యాటక విధానాలేనని వ్యాఖ్యానించారు.

దేశ సరిహద్దుల్లో పహారా కాస్తోన్న సైన్యానికి అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన యుద్ధ పరికరాలను అందజేశామని, ఫలితంగా చొరబాట్లు తగ్గాయని రాష్ట్రపతి చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచి వేశామని పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమూలంగా తుడిచివేయడం వల్ల దేశంలో అవాంఛనీయ సంఘటనలు, మావోయిస్టుల హింసాత్మక దాడులు భారీగా తగ్గాయని అన్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలు అనే నాలుగు బలమైన స్తంభాలపై సమగ్ర దేశాభివృద్ధిని సాధిస్తోన్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నాలుగూ మూల స్తంభాలుగా మారాయని, వాటిమీదే దేశ నిర్మాణం ఆధాపడి ఉందని చెప్పారు.