Wednesday, October 2, 2024
HomeUncategorizedఉప్పు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక 

ఉప్పు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక 

Date:

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉప్పు గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ఉప్పు ఎక్కువగా తినే వారికి అనేక ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నందున ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఐరోపాలో ప్రతిరోజూ కనీసం 10,000 మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని తెలిపింది. అంటే ఏటా 40 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. యూరప్‌లోని మొత్తం మరణాలలో 40 శాతం గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయి.

9 లక్షల మరణాలను నివారించవచ్చు

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ మరణం సంభవిస్తుంది. ఉప్పు తీసుకోవడం తగ్గించడం ఈ సంఖ్యను తగ్గించవచ్చు. ఉప్పు తీసుకోవడం కనీసం 25 శాతం తగ్గించాలి. అలా జరిగితే 2030 నాటికి 9 లక్షల మరణాలను అరికట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే తెలిపారు.

ఒక టీస్పూన్ ఉప్పు సరిపోతుంది

ఐరోపాలో 30-79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రధాన కారణం ఉప్పు. ఐరోపాలో 53 దేశాలలో 51 దేశాలు రోజువారీ ఉప్పును 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 గ్రాముల ఉప్పు లేదా అంతకంటే తక్కువ తినాలని సిఫార్సు చేస్తోంది. అంటే, ఒక టీస్పూన్ లేదా అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడం మంచిది. కానీ ఐరోపాలో దీనిని విస్మరించారు. యూరోపియన్లు ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. అందుకని ఈ ఆహారాలు తినడం మానుకోవాలని అంటారు.

చనిపోయినవారిలో మగవారే ఎక్కువ

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది. గుండెపోటు రావచ్చని ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచంలోనే అత్యధిక రక్తపోటు రోగులు యూరప్‌లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గుండె జబ్బుల వల్ల మహిళల కంటే పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. ఈ నిష్పత్తి 2.5.

ఉప్పు తినడం ప్రమాదకరం

30 నుండి 69 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు పశ్చిమ ఐరోపాలో కంటే తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఐదు శాతం ఎక్కువ. ఉప్పు తినడం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ గణాంకాలు ఐరోపాకు చెందినవే అయినప్పటికీ, ఏ దేశంలోనైనా ఎవరైనా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, అతను గుండె జబ్బులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల ఉప్పును మితంగా తినాలని ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది.