Sunday, September 22, 2024
HomeUncategorizedఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Date:

ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు కూలిపోయాయి. వర్షం కారణంగా కేదార్‌నాథ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దెహ్రాదూన్‌, హల్ద్వాని, చమోలి జిల్లాల్లో నలుగురు గల్లంతయ్యారు. దెహ్రాదూన్‌లో పరిస్థితులు భయానకంగా మారాయి. పలుచోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హరిద్వార్‌ ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కన్‌ఖాల్‌ పోలీస్టేషన్‌ నీట మునిగింది. భూపత్వాలా, హరిద్వార్‌, నయా హరిద్వార్‌, కన్‌ఖాల్‌, జవల్‌పుర్‌ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్‌ రంగంలోకి దిగాయి. భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ మార్గంలోని భింబలి చౌకి ప్రాంతంలో కాలిబాట కొట్టుకుపోయిందని పర్యావరణ విపత్తు ప్రతిస్పందన శాఖ కార్యదర్శి వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. మరోవైపు కొండ ప్రాంతాల్లో రాళ్లు కూలిపోతున్న కారణంగా కేదార్‌నాథ్‌కు వెళ్లే 200 మంది ప్రయాణికులను నిలిపివేసినట్లు చెప్పారు. మార్గమధ్యంలో ఉన్న వారిని హెలికాప్టర్‌సాయంతో వెనక్కి తీసుకొచ్చినట్లు తెలిపారు. రోడ్లమరమ్మతులు పూర్తయ్యే వరకు యాత్రికులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. మరోవైపు చార్‌ధామ్‌ యాత్ర కోసం నూతన రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు.