త్వరలో జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉగ్రనిధుల కేసు నిందితుడు, లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్‌కు కోర్టులో ఊరట లభించింది. ఆయనకు మంగళవారం ఢిల్లీ కోర్టు ఎన్నికల ప్రచారం నిమిత్తం బెయిల్ మంజూరు చేసింది. దాని గడువు అక్టోబర్ రెండుకు పూర్తికానుంది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో ఇంజినీర్ రషీద్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని తిహాడ్ జైల్లో ఉన్నారు. సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో అక్టోబర్ ఒకటి వరకు జరగనున్న జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం బెయిల్ ఇవ్వాలని రషీద్ చేసిన అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయన లంగేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2008, 2014లో విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. బారాముల్లా నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి, విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా ప్రమాణస్వీకారం నిమిత్తం జులై 5న న్యాయస్థానం ఆయనకు కస్టడీ పెరోల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ బెయిల్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో ఐదు దశల్లో జరిగాయి. ఈసారి మూడు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి