Monday, October 7, 2024
HomeUncategorizedఈ క్రికెట‌ర్లు దివ్యాంగుల‌ను అవ‌మాన‌ప‌రిచారు

ఈ క్రికెట‌ర్లు దివ్యాంగుల‌ను అవ‌మాన‌ప‌రిచారు

Date:

మ‌న దేశానికి చెందిన ముగ్గురు మాజీ క్రికెట‌ర్లు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యువ‌రాజ్‌, సురేశ్ రైనా బాలీవుడ్‌ పాట ‘తౌబా తౌబా’ను తమ స్టైల్‌లో రీక్రియెట్‌ చేసి చిక్కుల్లో పడ్డారు. ఈ వీడియో ద్వారా దివ్యాంగులను అవమానపరిచారంటూ పలు వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ముగ్గురు మాజీ ఆటగాళ్లపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

అసలేం జరిగిందంటే.. తాజాగా ‘వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024’ టైటిల్‌ నెగ్గిన జోష్‌లో ఉన్న యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, సురేశ్‌ రైనా ‘తౌబా తౌబా’ పాటకు రీల్‌ చేశారు. అందులో వారు నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కన్పించారు. ఈ వీడియోను వీరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ”15 రోజుల లెజెండ్స్‌ క్రికెట్‌ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి. శరీరంలో ప్రతి అవయవం నొప్పిగా ఉంది. ఇది మా వెర్షన్‌ ‘తౌబా తౌబా’ డ్యాన్స్‌” అంటూ రాసుకొచ్చారు. దీనిపై దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు మండిపడ్డారు. ఇది దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు.

దీనిపై నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ పీపుల్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అర్మన్‌ అలీ ఢిల్లీలోని అమర్‌ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేశంలోని పది కోట్లకుపైగా ఉన్న దివ్యాంగులను అవమానపరిచారని అందులో పేర్కొన్నారు. అలాంటి కంటెంట్‌ను అనుమతించినందుకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌పై , వీడియో చేసినందుకు క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ అయిన హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్‌ చేసి క్షమాపణలు చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని వివరణ ఇచ్చాడు.