Saturday, September 21, 2024
HomeUncategorizedఈడీని ఆయుధంగా మార్చుకున్న బిజెపి

ఈడీని ఆయుధంగా మార్చుకున్న బిజెపి

Date:

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని కొత్త ఆయుధంగా మార్చుకుందని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిలో పాల్గొన్న కేజ్రీవాల్‌ భాజపాపై విమర్శలు గుప్పించారు. దర్యాప్తు సంస్థ ఈడీని కేంద్రప్రభుత్వం ఆయుధంలా మార్చుకుంది. దేశంలోని కోట్లాది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష ప్రభుత్వాలపై కేంద్రం దీన్ని ప్రయోగిస్తోంది. గతంలో నేరం రుజువైతే జైలుకు పంపేవారు. కానీ, ప్రస్తుతం జైలుకు పంపాక వారిపై ఏ కేసు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆప్‌కి కేంద్రంలో అధికారం దక్కితే సీన్‌ రిపీట్‌ అవుతుంది. మేమూ మీలాగే చేసి చూపిస్తాం. అప్పుడు ఆ చట్టాలు మీకు వర్తిస్తాయి అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌పై కేసు నమోదు చేయకముందే ఆయన్ను జైల్లో పెట్టారు. కొద్ది కాలంలోనే నాతో సహా సీఎం పినరయి విజయన్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా జైల్లో పెట్టి ఆయా ప్రభుత్వాలను పడగొట్టే అవకాశం లేకపోలేదు” అని ఆరోపించారు. కేంద్రం నుంచి అందే నిధుల విషయంలో కేరళకు అన్యాయం జరుగుతోందని సీఎం పినరయి విజయన్‌ దేశ రాజధానిలో ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.