Saturday, October 5, 2024
HomeUncategorizedఇప్పటివరకు 19 శాతం తక్కువ వర్షపాతం

ఇప్పటివరకు 19 శాతం తక్కువ వర్షపాతం

Date:

దేశంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసిన అంచనాలు తలకిందులవుతున్నాయి. ఐఎండీ ఆశించిన విధంగా రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినా వాటి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటోంది. దీంతో జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం ఐఎండీ అంచనాల కంటే 19 శాతం తగ్గినట్లు తేల్చారు.

రుతుపవనాల మందగమనం

దేశంలో రుతుపవనాల మందగమనం కారణంగా వర్షపాతం లోటు కనిపిస్తోంది. ప్రతీ ఏటా జూన్ లో నమోదయ్యే వర్షపాతంలో ఈసారి ఏకంగా 19 శాతం తగ్గుదల నమోదైంది. జూన్ 12 తర్వాత రుతుపవనాల మందగమనం కారణంగా దేశంలోని మొత్తం 36 సబ్ డివిజన్లలో ఏకంగా 21 చోట్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. ఈ నెలలో భారతదేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని ముందుగా అంచనా వేసిన భారత వాతావరణ విభాగం జూన్ 18న దాని ప్రారంభ అంచనాను సవరించుకోవాల్సి వచ్చింది.

ఇప్పటికి పలుచోట్ల ఎండలే

జూన్ నెలలో నమోదవుతుందని భావించిన దీర్ఘకాల సగటు వర్షపాతం(ఎల్పీఏ)ను సాధారణం కంటే తక్కువగా అంటే ఏకంగా 92 శాతం తగ్గించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వాతావరణ పరిస్ధితులతో వాతావరణ శాఖ తమ అంచనాల్ని మారుస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. జూన్‌లో దక్షిణ ద్వీపకల్పం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసిన ఐఎండీ, రుతుపవనాలకు పురోగమనానికి అనుకూల పరిస్ధితులు లేకపోవడంతో వాటిని మార్చుకుంది. దేశంలో ఇప్పటివరకూ 19 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా.. పలు చోట్ల 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తూర్పు, ఈశాన్య భారతదేశంలో -16 శాతం, మధ్య భారతదేశంలో -23 శాతం వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ ద్వీపకల్పంలో మాత్రమే కాస్త అధికంగా ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. ఇక్కడ మాత్రం సాధారణ వర్షపాతం కంటే 9 శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి.