Friday, October 4, 2024
HomeUncategorizedఇదో కొత్త మోసం.. కాల్ చేసి భయపెడుతారు

ఇదో కొత్త మోసం.. కాల్ చేసి భయపెడుతారు

Date:

డిజిటల్ ప్రపంచంలో కొత్త, కొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత అటాకర్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కస్టమ్స్ ఆఫీసర్స్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఒక ముఖ్యమైన పబ్లిక్ అవేర్‌నెస్ కాంపెయిన్‌ ప్రారంభించింది. ఇండియన్ కస్టమ్స్ ఆఫీసర్స్‌గా నటిస్తూ మోసగాళ్లు చేసే నేరాలను అడ్డుకోవడమే దీని లక్ష్యం.

సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ ద్వారా బాధితులను భయపెట్టి, డబ్బు కట్టకపోతే శిక్ష పడుతుందని బెదిరించి భారీగా మనీ వసూలు చేస్తారు. అయితే కస్టమ్స్ అధికారులు ఎప్పుడూ ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయరని ప్రజలు గమనించాలి. “క్రిమినల్స్ ఇండియన్ కస్టమ్స్ ఆఫీసర్స్‌గా నటిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తున్నారని న్యూస్ పోర్టల్స్‌, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తెలిసింది. ఈ మోసాలు ప్రధానంగా ఫోన్ కాల్స్‌ లేదా ఎస్ఎంఎస్ ద్వారా జరుగుతున్నాయి. వెంటనే శిక్ష పడుతుందనే భయాన్ని బాధితుల్లో కలిగించి, వారి నుంచి మోసగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు.” అని సీబీఐసీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

మోసాలకు చెక్ పెట్టడానికి సీబీఐసీ చర్యలు

మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సీబీఐసీ దేశవ్యాప్తంగా వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇస్తోంది. అనుమానాస్పద కాల్స్‌ లేదా ఎస్ఎంఎస్ ల గురించి ప్రజలను ఎస్ఎంఎస్, ఈమెయిల్స్‌ ద్వారా హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐసీ ఆఫీస్‌లు స్థానిక అధికారులు, వ్యాపార సంస్థలతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ఎలా రక్షించుకోవాలి?

ఇండియన్ కస్టమ్స్ ఆఫీసర్స్‌ ఎప్పుడూ పర్సనల్ అకౌంట్లకు ట్యాక్స్ చెల్లించమని ప్రజలను ఫోన్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించరు. అందుకే అనుమానాస్పద కాల్స్‌ వస్తే డిస్‌కనెక్ట్ చేయాలి. మెసేజ్‌లు ఇగ్నోర్ చేయాలి. ఎవరైనా ఫోన్‌ కాల్ చేసి పెనాల్టీలు కట్టాలని అడిగితే అలర్ట్ అవ్వాలి. పాస్‌వర్డ్స్‌, సివివి, ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దు. మనీ రిక్వెస్ట్ చేసిన వారి గుర్తింపును వెరిఫై చేసుకోకుండా డబ్బు పంపకూడదు. ఇండియన్ కస్టమ్స్ నుంచి వచ్చే ఒరిజినల్ కమ్యూనికేషన్లలో డాక్యుమెంట్ ఐడెంటిటీ నంబర్ ఉంటుంది. దీనిని సీబీఐసీ వెబ్‌సైట్‌ https://www.cbic.gov.in/లో వెరిఫై చేయవచ్చు. ఫ్రాడ్/చీటింగ్ కేసులను సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1930కి రిపోర్ట్ చేయాలి.

మోసగాళ్ల స్కామ్ టెక్నిక్స్

క్రిమినల్స్‌ కొరియర్ అధికారులుగా నటిస్టారు. కొరియర్‌లో విలువైన వస్తువు వచ్చినట్లు చెబుతారు. అయితే కస్టమ్స్ ఆ ప్యాకేజీని నిలిపివేసిందని, ట్యాక్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తారు. కస్టమ్స్ అధికారులుగా నటించి, ప్యాకేజీలను విడుదల చేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ప్యాకేజీలలో మందులు, ఫారిన్ కరెన్సీ, ఫేక్ పాస్‌పోర్ట్, నిషేధిత వస్తువులు, డ్రగ్స్ వంటి అక్రమ వస్తువులు ఉన్నాయని అబద్ధం చెప్తారు. డబ్బు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తారు. అయితే ఇలాంటి మాటలు నమ్మి మనీ సెండ్ చేయవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.