Wednesday, October 2, 2024
HomeUncategorizedఇకపై యాదాద్రి కొండపై ప్లాస్టిక్‌ నిషేధం

ఇకపై యాదాద్రి కొండపై ప్లాస్టిక్‌ నిషేధం

Date:

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఒకటి. ఇకనుండి యాదాద్రి కొండపై ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత భక్తులు అత్యధికంగా సందర్శించే ఆలయం యాదాద్రి అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఆలయ రద్దీ కూడా పెరిగింది. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ కొండపై కూడా ప్లాస్టిక్‌పై నిషేదాన్ని విధించారు.

తిరుమల ఆలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ప్లాస్టిక్‌ను నిషేదించింది. ఇదే పద్ధతిని అన్నవరం దేవస్థానంలోనూ పాటిస్తున్నారు. ఇప్పుడు యాదాద్రిలోనూ ప్లాస్టిక్‌పై అధికారులు నిషేదం విధించారు. ఈ ఆలయాల్లోకి భక్తులు, సిబ్బంది ఎవరూ ప్లాస్టిక్ వంటి వస్తువులేవీ తీసుకెళ్లటానికి వీళ్లేదు. పర్యావరణ పరిరక్షణలో భాగాంగా ప్లాస్టిక్ వాడకం నిషేదిస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

ఈ మేరకు దేవస్థానంలోని వివిధ భాగాలకు ఈవో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం విధించినట్లు అధికారులు వెల్లడించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ప్లాస్టికేతర వస్తువులు ఉపయోగించాలని ఆలయ అధికారులు సూచించారు. ఈ నిషేదాన్ని ఆలయ సిబ్బంది విధిగా పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకూడదని ఆలయ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.