Saturday, September 21, 2024
HomeUncategorizedఇంద్రవెల్లి అడవుల్లో మొదలైన నాగోబా జాతర

ఇంద్రవెల్లి అడవుల్లో మొదలైన నాగోబా జాతర

Date:

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు నాగోబా జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో మెస్రం వంశీయుల చేతుల మీదుగా ఈ జాతర జరుగుతుంది. ఈ ఉత్సవం ఆదివాసీలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని వర్గాల వారి నమ్మకాన్ని పొందింది. కేస్లాపూర్‌లో దాదాపు 400 మంది గిరిజనులు నివసిస్తున్నారు. అయితే, జాతరను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు సహా లక్షలాదిమంది సందర్శకులు ఇక్కడికి చేరుకుంటారు. అంతేకాదు, మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబాను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే జాతరకు ఎలాంటి ఆటంకాలూ కలగకుండా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు డీఏస్పీల ఆధ్వర్యంలో, ఆరుగురు సీఐలు, 28 మంది ఎస్సైలు, 37 మంది ఏఎస్సైలు, 94 మంది హెడ్ కానిస్టేబుళ్లు 94, 243 సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఈ రోజు (శుక్రవారం) అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర ప్రారంభమై, మూడు రోజుల తర్వాత అంటే 12న దర్బార్తో ముగుస్తుంది. ప్రధానంగా మెస్రం వంశీయులు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హస్తిన మడుగుకు వెళ్లి తెచ్చిన అక్కడ గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేస్తారు. జాతరకు మూడు రోజుల ముందే ఈ జలాలను తీసుకువస్తారు. నాగోబా జాతర క్రతువులు పరిశీలిస్తే.. ఆదివాసీ జీవన విధానాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలుగుతుంది. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరడంతో జాతర ప్రారంభమవుతుంది. అంతేకాదు, నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజల కోసం సిరికొండ మండలంలో తయారు చేయించిన మట్టికుండలను వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది.