Friday, October 4, 2024
HomeUncategorizedఇండియాకు చేరుకున్న కువైట్ మృతదేహాలు

ఇండియాకు చేరుకున్న కువైట్ మృతదేహాలు

Date:

కువైట్‌ అగ్నిప్రమాదంలో మరణించిన భారత కార్మికుల మృతదేహాలు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేక విమానం శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ తెల్లవారుజామున 4 గంటలకే కువైట్‌ నుంచి బయలుదేరిన విమానం ముందుగా ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికుల మృతదేహాలను దించి.. మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరింది. మిగిలిన మృతదేహాలతో సాయంత్రం ఢిల్లీలో దిగింది.

కువైట్‌ అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది కార్మికులు మరణించగా వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. ఆ 45 మందిలో కేరళకు చెందినవారు 12 మంది, తమిళనాడుకు చెందిన వారు ఏడుగురు, ఏపీకి చెందినవారు ముగ్గురు ఉన్నారు. మిగిలిన వారు వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. విమానం రాకకుముందే పాలం విమానాశ్రయం వద్ద అధికారులు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. అధికారులు మృతులకు ఎయిర్‌పోర్టులో నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహాలను అంబులెన్సులలో స్వగ్రామాలకు తరలించారు.

కువైట్‌లోని మంగఫ్‌ సిటీలో బుధవారం ఉదయం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్‌బీటీసీకి చెందిన 6 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వంట గదిలో ప్రమాదం జరిగిందని, అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో పొగ పీల్చడంవల్ల పలువురు కార్మికులు ఊపిరాడక చనిపోయినట్టు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 160 మంది కార్మికులు ఉన్నారు.