Thursday, September 19, 2024
HomeUncategorizedఆ గ్రామంలో ప్ర‌తి ఇంటిలో ఓ ఉపాధ్యాయుడు

ఆ గ్రామంలో ప్ర‌తి ఇంటిలో ఓ ఉపాధ్యాయుడు

Date:

దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కొన్ని గ్రామాల‌కు కొంత చరిత్ర ఉంది.. అక్క‌డ ఆచారాలు, సంప్ర‌దాయాలు, వారి అల‌వాట్లు గ్రామానికి మంచి పేరును తీసుకోస్తాయి. అలాంటిది ఒక గ్రామంలో అంద‌రూ విద్యావంతులే ఉన్నారు. విద్య నేర్పే గురువులు ఇంటికొకరు ఉన్నారు. అందుకే ఈ గ్రామాన్ని ‘పంతుళ్ల పల్లె’ అని కూడా పిలుస్తుంటారు. ఇంచల్‌.. కర్ణాటకలోని బెళగావి జిల్లా సావడట్టి తాలూకాలోని ఓ గ్రామం. గ్రామ జనాభాలో పది శాతం అనగా 600 మంది ఉపాధ్యాయులు గ్రామంలోని దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరు ఉపాధ్యాయ వృత్తిని తమ జీవనోపాధిగా ఎంచుకోవడం విశేషం. సిద్ధ సంస్థాన్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు డాక్టర్‌ శివానంద భారతి స్వామీజీ దూరదృష్టితో చేపట్టిన చర్యలే నేడు ఆ గ్రామంలో విద్యా కుసుమాలు పరిమళాలు వెదజల్లుతున్నాయి.

1970 దశకంలో ఆ గ్రామంలో ఒకే ఒక్క ప్రాథమిక పాఠశాల ఉండేది. ఇక్కడ ఉన్నత విద్యా సంస్థల ఆవశ్యకతను గుర్తించిన డాక్టర్‌ శివానంద భారతి మరికొందరు నిబద్ధతగల టీచర్లతో కలిసి ఓ విద్యా సొసైటీని స్థాపించారు. ఇక్కడ 1984లో గ్రామీణ ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రం ఏర్పడింది. ఈ కేంద్రంలో ఇంచల్‌ గ్రామానికి చెందిన వారికి ఉచితంగా శిక్షణ, భోజనం సదుపాయం కల్పించారు. 1988 నుంచి సగటున ప్రతి ఏడాది ఇంచల్‌కు చెందిన 20 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందేవారు.

దేశ ప్రజలను విద్యావంతులను చేయడం ఎంత ముఖ్యమో.. దేశ రక్షణ కూడా అంతే ప్రాధాన్యం గలదని ఇంచల్‌వాసులు గుర్తించారు. దీంతో చాలామంది యువకులు దేశ సైన్యంలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఇంచల్‌ గ్రామానికి చెందిన 300 మందికిపైగా యువకులు నేడు దేశ త్రివిధ దళాల్లో సేవలందిస్తున్నారు.