2017లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. సరైన ఆధారాలు లేవంటూ అప్పుడు నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్ , ఎనిమిది కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వాటిలో ఆరు కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదని, ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ అధికారులు విచారించారు. వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. వాటిలో పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్‌ను మాత్రమే పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్.. వారి శరీరాల్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం 6 కేసులను కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువరించింది.