Saturday, September 28, 2024
HomeUncategorizedఆంధ్రాలో ఇప్పటివరకు 100కోట్లకు పైగా నగదు సీజ్

ఆంధ్రాలో ఇప్పటివరకు 100కోట్లకు పైగా నగదు సీజ్

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు జరుపుతున్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటినుండి నేటి వరకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ మరియు ఎన్నికల సామాగ్రిని సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం జరిగిందన్నారు.

అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారాను మరియు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటినుండి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా నగదు, లిక్కర్, డ్రగ్స్, విలువైన వస్తువులు, ప్రజలకు ఉచితంగా ఇచ్చే బహుమతులు, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో కేవలం గత 24 గంటల్లోనే రూ.1,97.66 లక్షల విలువైన వస్తువులను జప్తుచేయడం జరిగిందన్నారు.

ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుండి నేటి వరకు చేయబడిన మొత్తం జప్తులో రూ.2,503.13 లక్షల నగదు, రూ.1,249 లక్షల విలువైన 6,14,837 లీటర్ల లిక్కర్, రూ.205 లక్షల విలువైన 68,73,891 గ్రాముల డ్రగ్స్ ను, రూ.5,123 లక్షల విలువైన 11,54,618 గ్రాముల బంగారం, వెండి తదితర వస్తువులను, రూ.242 లక్షల విలువైన 4,71,020 ఉచితాలను, 704 లక్షల విలువైన 9,84,148 ఇతర వస్తువులను జప్తుచేయడం జరిగిందని ఆయన తెలిపారు.