Thursday, September 19, 2024
HomeUncategorizedఅర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు ఇళ్ల స్థలాలు ఇస్తాం

అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు ఇళ్ల స్థలాలు ఇస్తాం

Date:

తెలంగాణ‌లో అర్హులైన ప్ర‌తి జ‌ర్న‌లిస్ట్‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీలో సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ”గతంలో జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలా వ్యవహరించినప్పుడే సమస్యను పరిష్కరించవచ్చు. మా ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. వృత్తిపరమైన గౌరవం మనకు మనమే పెంచుకోవాలి.

గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. మా ప్రభుత్వం వచ్చాక స్పీకర్‌కు నేనే అసెంబ్లీ లోపలికి జర్నలిస్టులను అనుమతించాలని కోరా. ఏ వర్గంలో అయినా కొందరు చేసే పని వల్లనే ఇబ్బంది కలుగుతోంది. గతంలో సచివాలయానికి వెళ్లేందుకు మాకే అనుమతి లేదు. కొంత మందికి పాస్‌లు ఇచ్చి లోపలికి రప్పించి ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపైనే ఉంది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్‌ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్‌ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీలో 73 మంది నిజాన్ని చూడక ముందే కన్ను మూశారు. అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు ఫ్యూచర్‌ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తాం” అని రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.