Monday, December 23, 2024
HomeUncategorizedఅయోధ్యలోని రెస్టారెంట్‌లో భారీ రేట్లు

అయోధ్యలోని రెస్టారెంట్‌లో భారీ రేట్లు

Date:

అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ తక్కువ ధరల్లో భక్తుల సేవలందించాల్సిన హోటల్‌ అధిక చార్జీలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. శ్రీరాముడికి ఎంగిలి పళ్లు తినిపించిన అపర భక్తురాలైన శబరి పేరుతో ఏర్పాటైన రెస్టారెంట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. శబరి రసోయిలో రెండు కప్పుల టీ , రెండు బ్రెడ్‌ ముక్కల కోసం ఏకంగా రూ. 252 వసూలు చేసింది. సంబంధిత బిల్లును కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇంత అన్యాయం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ అంశం చివరికి అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ)కి చేరింది. దీంతో సదరు హోటల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది, లేని పక్షంలో ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్‌ హెచ్చరించారు.

ఒప్పందం ప్రకారం బడ్జెట్ కేటగిరీ కింద జాబితా చేయబడిన ఈ రెస్టారెంట్ భక్తులకు , యాత్రికులకు రూ. 10కి ఒక కప్పు టీ, రెండు టోస్ట్‌లను అందించాల్సి ఉంది. మరోవైపు ఈ ఆరోపణలు సదరు రెస్టారెంట్‌ ఖండించింది. ఇది ఫ్రీ గా తినాలనుకుని భావించిన కస్టమర్ల పన్నాగమని, బిల్లును సోషల్ మీడియాలో వైరల్‌ కావడం వెనుక కుట్ర ఉందని శబరి రసోయి రెస్టారెంట్ ప్రాజెక్ట్ హెడ్ సత్యేంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు. తమ వద్ద పెద్ద పెద్ద హోటళ్లలో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అథారిటీ నోటీసులకు సమాధానమిచ్చినట్టు తెలిపారు.. అరుంధతీ భవన్ పేరుతో కొత్తగా నిర్మించిన వాణిజ్య సముదాయంలో శబరి రసోయి ఉంది. ఇది రామ మందిరం సమీపంలోని తెహ్రీ బజార్‌లో అహ్మదాబాద్‌కు చెందిన కవాచ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేసింది.