Wednesday, September 25, 2024
HomeUncategorizedఅనవసరంగా నీరు వాడుతున్నారని జరిమానా

అనవసరంగా నీరు వాడుతున్నారని జరిమానా

Date:

బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉంది. గత కొద్ది రోజులుగా తాగు నీటి కోసం బెంగళూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా తాగునీరు అనవసరమైన పనులకు వినియోగించిన కుటుంబాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నీటి వృథాపై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వేదికగా ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 22 కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. నీటి కొరత నేపథ్యంలో తాగునీరు సంరక్షణకు తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు తెలిపింది. తాగునీటిని కార్‌ వాషింగ్‌ లేదా గార్డెన్ అవసరాలకు వాడినందుకు గాను నగరంలోని వివిధ ప్రాంతాల్లో 22 కుటుంబాల నుంచి మొత్తం రూ.1.1 లక్షల మేర జరిమానాగా వసూలు చేసినట్లు వెల్లడించింది. దక్షిణ ప్రాంతం నుంచే అత్యధికంగా రూ.80 వేలు జరిమానా వసూలు చేసినట్లు పేర్కొంది.

బెంగళూరు నగరంలో నీటి కటకటను దృష్టిలోఉంచుకుని తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఇటీవల నీటి సరఫరా బోర్డు ప్రజలకు సూచించింది. వాహనాలు కడగడం, నిర్మాణాలు, వినోద సంబంధిత కార్యక్రమాల కోసం తాగునీరు వాడొద్దని కోరింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మళ్లీ ఈ చర్య పునరావృతమైతే ప్రతిసారీ రూ.500 అదనంగా జరిమానా విధించాలని నిర్ణయించింది. మరోవైపు, హోలీ వేడుకల సందర్భంగా ప్రజలు కావేరీ, బోరుబావుల నీటిని పార్టీలు, రెయిన్‌ డ్యాన్స్‌ల కోసం వినియోగించొద్దని సూచించింది. అనవసర నీటి వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ఎయిరేటర్లు అమర్చేలా హోటళ్లు, అపార్టుమెంట్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఓ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.