Wednesday, October 2, 2024
HomeUncategorizedఅదానీ ఆస్తిలో పెరిగిన రూ.84,064 కోట్ల సంపద

అదానీ ఆస్తిలో పెరిగిన రూ.84,064 కోట్ల సంపద

Date:

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. ఇటీవల అదానీ కంపెనీల షేర్లు గణనీయంగా పుంజుకోవటం అందుకు దోహదం చేసింది.

బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. 111 బిలియన్‌ డాలర్లతో అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అంబానీ 109 బిలియన్ డాలర్లతో 12 స్థానంలో కొనసాగుతున్నారు. అదానీ షేర్లపై అమెరికా బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ ఇటీవల సానుకూల రేటింగ్‌ ఇచ్చింది. దీంతో శుక్రవారం ఆయా కంపెనీల షేర్లు గరిష్ఠంగా 14 శాతం వరకు దూసుకెళ్లాయి. కొత్తగా రూ.84,064 కోట్ల సంపద వచ్చి చేరింది. అదానీ గ్రూప్‌లోని 10 నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.17.51 లక్షల కోట్లు దాటింది. వచ్చే దశాబ్దకాలంలో 90 బిలియన్‌ డాలర్లతో వ్యాపార విస్తరణను చేపట్టనున్నట్లు ఈ గ్రూప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

గౌతమ్‌ అదానీ 2022లోనూ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ నివేదికతో ఆయన సంపద భారీగా ఆవిరైన విషయం తెలిసిందే. అనేక దిద్దుబాటు చర్యల ఫలితంగా కంపెనీల షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. 2024లో ఇప్పటి వరకు అదానీ సంపద 26.8 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది. అదే సమయంలో అంబానీ సంపద 12.7 బిలియన్‌ డాలర్లు పెరిగింది. 2014లో ఐదు బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ గత పదేళ్లలో 111 బిలియన్‌ డాలర్లకు ఎగబాకారు. 2022 సెప్టెంబరులో స్వల్ప కాలం పాటు ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగానూ నిలిచారు.