అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. దాల్ సరస్సు ఒడ్డున మోడీ యోగా చేయనుండగా.. జూన్ 21న జరిగే కార్యక్రమంలో దాదాపు ఏడు వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించిన జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. యోగా డే సందర్భంగా మోదీ కశ్మీర్ లోయకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
”కశ్మీర్ ప్రజలతో మోదీకి మంచి అనుబంధం ఉంది. అందుకే ఆయన ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మోదీ రాక మాకెంతో గర్వకారణం. ఆ రోజు జరగబోయే కార్యక్రమంలో ఆయనతో పాటు 7 వేల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం” అని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ”గత పదేళ్లలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై యోగా ఎంతో గుర్తింపు పొందింది. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో 23.5 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. ఏటా యోగా చేసే వారి సంఖ్య పెరగడం హర్షణీయం. ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం కోసం ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు” అని జమ్మూకశ్మీర్ ఎల్‌జీ వెల్లడించారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుస ఉగ్ర ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిస్తోంది. దీంతో ఈ నెల 29న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సిన్హా పేర్కొన్నారు.