దేశంలో జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమెకు తొలుత లేఖ రాయగా.. తాజాగా ఇండియా కూటమి సభ్యులు లోక్‌సభ వేదికగా జీఎస్టీ తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లోక్‌సభలో ఆమె మాట్లాడారు.
జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు కూడా బీమా ప్రీమియంలపై పన్ను వసూలు అయ్యేదని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఇదేమీ కొత్త విషయం కాదని, అన్ని రాష్ట్రాల్లో ఇది అమలైందని పేర్కొన్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాకా అదే విధానం కొనసాగిందన్నారు. ఇలా వసూలైన జీఎస్టీలో 75 శాతం రాష్ట్రాలకే వెళుతోందని పేర్కొన్నారు. ఇక్కడ ఆందోళన చేస్తున్న వారు ఎప్పుడైనా తమ రాష్ట్రాల్లో దీనిపై చర్చించారా? అని ప్రశ్నించారు. ఒకరు లేవనెత్తిన అంశంపై (గడ్కరీనుద్దేశించి).. ఏకంగా 200 మంది ఎంపీలు పార్లమెంట్ వేదికగా అదే పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు.