Sunday, September 22, 2024
HomeUncategorizedఅంకిత భావంతో ఉద్యోగులు సేవ చేయాలి

అంకిత భావంతో ఉద్యోగులు సేవ చేయాలి

Date:

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి దేశానికి అంకిత భావంతో సేవ చేయడం కీలకమని, గత ప్రభుత్వంతో పోల్చుకొంటే ఈ పదేళ్లలో మేం 1.5 రెట్లు అదనంగా ఉద్యోగావకాశాలను కల్పించాం” అని ప్రధాని మోడీ తెలిపారు. నియామకాల ప్రక్రియను తమ ప్రభుత్వం పారదర్శకంగా మార్చిందని అన్నారు. సోమవారం ఆయన ‘రోజ్‌గార్‌ మేళా’ కింద ఉద్యోగాలు పొందిన లక్షమందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం నియామక ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తోందన్నారు. దీంతో ప్రతి ఒక్క అభ్యర్థి తన సామర్థ్యం ప్రదర్శించేలా సమాన అవకాశాలు లభిస్తున్నాయన్నారు. అభ్యర్థి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొన్న నాటి నుంచి అపాయింట్‌మెంట్‌ లేఖను అందుకొనే వరకూ ఉన్న సమయాన్ని కుదించామన్నారు. ”గత ప్రభుత్వాలు నియామక ప్రక్రియల్లో జాప్యం చేసేవి. దీంతో అవి సుదీర్ఘంగా సాగేవి. ఆ సమయంలో లంచాల వసూళ్లు వంటివి జోరుగా చోటు చేసుకొనేవి. కానీ, మా ప్రభుత్వం నియామకాలను పారదర్శకంగా చేపడుతోంది. దేశానికి యువత సేవ చేసేలా 2014 నుంచి వారికి సహకరించాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని వ్యాఖ్యానించారు.

మా ‘వికసిత్‌ భారత్‌’ ప్రయాణంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగిదీ కీలక పాత్రే. నేడు కొత్తగా చేరుతున్న లక్షమంది ఉద్యోగులు మాకు నూతన శక్తిని అందిస్తారు. వారు ఏ శాఖలో చేరారన్నది ముఖ్యం కాదు.. యువతకు 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ అక్టోబర్‌ 2022లో ‘రోజ్‌గార్‌ మేళా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజాగా ఆయన ‘కర్మయోగి భవన్‌’కు శంకుస్థాపన చేశారు. ‘మిషన్‌ కర్మయోగి’ కింద వివిధ వర్గాలను సమన్వయం చేసుకోవడానికి ఈ భవనాన్ని వినియోగించనున్నారు. సామర్థ్యాల పెంపునకు అవసరమైన సంకల్పాన్ని ఇది బలోపేతం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.