Monday, December 30, 2024
HomeUncategorizedసామాజిక అంత‌రానికి ఈ-కామ‌ర్సే కార‌ణం

సామాజిక అంత‌రానికి ఈ-కామ‌ర్సే కార‌ణం

Date:

దేశంలో పుట్టుగొడుగుల్లా శరవేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్‌ సంస్కృతిపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా సంస్థలు పుట్టుకొస్తుండటాన్ని గొప్ప విజయంగా భావించకూడదని, ఇది ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు. ‘ఉద్యోగ కల్పన, వినియోగదారుల సంక్షేమంపై ఇ-కామర్స్‌ ప్రభావం’ అనే నివేదిక విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడారు. ఇ-కామర్స్‌ సంస్థలు సామాజిక అంతరానికి కారణమవుతున్నాయని పీయూష్‌ గోయల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఇ-కామర్స్‌ నెట్‌వర్క్‌ వల్ల రాబోయే పదేళ్లలో సగం మార్కెట్‌ అవే ఆక్రమించడాన్ని విజయంగా భావించకూడదని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఇ-కామర్స్‌ సంస్థలు పోటీని నివారించేందుకు అనుసరిస్తున్న ధరల విధానం వల్ల సంప్రదాయ రిటైల్‌ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తరహా ధరల విధానం దేశానికి మంచిదా..? అని ప్రశ్నించారు.

ముఖ్యంగా పెద్దపెద్ద ఇ-కామర్స్‌ సంస్థల పెట్టుబడి వ్యూహాలపై పీయూష్‌ గోయల్‌ విమర్శలు గుప్పించారు. బడా సంస్థలు భారత్‌లో బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించగానే మనం సంతోషంగా సెలబ్రేట్‌ చేసుకుంటామని, వాస్తవానికి ఆ పెట్టుబడులు సేవలకో, భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికో కాదని అన్నారు. తమ బ్యాలెన్స్‌ షీట్‌లోని నష్టాల భర్తీకి ఆ మొత్తాలను వినియోగిస్తున్నాయని చెప్పారు. తమపై ఎవరూ న్యాయ పోరాటానికి దిగకుండా బడా లాయర్లకు ఈ సంస్థలు కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటాయని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఒక ఏడాదిలో రూ.6 వేల కోట్ల నష్టం వచ్చిందంటే అది పోటీని తప్పించే ధరల విధానం కాక మరేమవుతుందని ప్రశ్నించారు. వాస్తవానికి ఇ-కామర్స్‌ సంస్థలు బిజినెస్‌ టు కస్టమర్‌ వ్యాపారాన్ని నిర్వహించకూడదని అన్నారు.