Sunday, December 22, 2024
HomeUncategorizedవ‌య‌నాడ్‌లో విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

వ‌య‌నాడ్‌లో విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

Date:

ఎడ‌తెరిపి లేని భారీ వర్షాలకు కేర‌ళ రాష్ట్రం వ‌య‌నాడ్‌ మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ విలయంలో మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. వంద మందికిపైగా ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సుమారు 70 మందికిపైగా గాయపడ్డారు. వారు మెప్పడిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానిక మీడియా నివేదించింది.

మెప్పడి, ముంద‌క్కాయి ప‌ట్టణం, చూర‌ల్ మాలాలో మంగళవారం తెల్లవారుజామున ఈ విలయం సంభవించింది. తొలుత రాత్రి ఒంటి గంట‌కు ముంద‌క్కాయి ప‌ట్టణంలో భారీ వ‌ర్షం కారణంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అక్కడ రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే.. చూర‌ల్‌మాలాలో తెల్లవారుజామున 4 గంట‌ల‌కు మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు స‌మీప ఇంళ్లలోకి నీరు ప్రవేశించింది. వ‌ర‌ద నీరు, బుర‌ద‌తో నిండిపోయాయి.

ఈ విలయంలో చూరల్‌ మాలా పట్టణం సగం వరకూ తుడిచి పెట్టుకుపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. చూర‌ల్ మాలాలో బ్రిడ్జ్ కూలిపోవ‌డంతో సుమారు 400 కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. వరద కారణంగా రోడ్లు, వంతెనలు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. దీని వ‌ల్ల రెస్క్యూ ఆప‌రేష‌న్స్ నిలిచిపోయాయి. వ‌య‌నాడ్ విల‌యానికి చెందిన వీడియోలు ఒక్కొక్కటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తీవ్రంగా ప్రవ‌హిస్తున్న నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ముంద‌క్కాయిలో ఉన్న ఓ మ‌ద‌ర‌సాలో 150 మంది చిక్కుకున్నారు. 4 గంట‌ల్లోనే మూడుసార్లు కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డంతో.. రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్లు కూడా దెబ్బతినడంతో.. రైలు సర్వీసులను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.