ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. దేశంలో రిజర్వేషన్లు, తదితర అంశాలపై అమెరికాలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విదేశాల్లో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో మన దేశాన్ని కించపర్చే వ్యాఖ్యలు చేసిన రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విఛ్చిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీకి తాను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నానని, బీజేపీ ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని అన్నారు. అదేవిధంగా దేశ భద్రతతో ఎవరూ ఆటలాడలేరని అమిత్ షా హెచ్చరించారు. రాహుల్ గాంధీ ప్రతిసారీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారని ఆరోపించారు. ఆయన దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. ప్రాంతీయ వాదం, మతం, భాష పరంగా చీలికలు తెచ్చే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన మరోసారి బయటపెట్టిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.