Sunday, January 5, 2025
HomeUncategorizedభార‌త్‌లో పెరుగుతున్న క్యాన్స‌ర్ కేసులు

భార‌త్‌లో పెరుగుతున్న క్యాన్స‌ర్ కేసులు

Date:

భార‌త‌దేశంలో రోజురోజుకు క్యాన్స‌ర్ కేసులు పెరుగుతున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా లోక్‌స‌భ‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ రోగులకు అందుబాటు ధరలో చికిత్స, మందులు అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా.. భారత్‌లో ఏటా క్యాన్సర్‌ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు. పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. దేశంలో ఏటా 15.5 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నట్లు సభకు వివరించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్‌ చికిత్స కోసం వినియోగించే మందుల ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తోందని తెలిపారు. ప్రభుత్వం విధించిన ధరల పరిమితి కారణంగా రోగులకు ఏటా రూ.294 కోట్లు ఆదా అవుతోందన్నారు.

హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు నడ్డా స్పందిస్తూ.. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని చెప్పారు. ఎక్కువ మంది వైద్యులు ఉండేలా మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోందని వివరించారు. వైద్య విద్య యొక్క నాణ్యత, పరిమాణంలో సమతుల్యత ఉండాలన్నారు. 2014లో మెడికల్ కాలేజీల సంఖ్య 387 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 731కి పెరిగినట్లు చెప్పారు. ఇక అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 సీట్ల నుంచి 1,12,112 (1.12 లక్షలు)కి పెరిగిందని నడ్డా సభకు తెలియజేశారు. వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 2014లో 31,185 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 72,627కు పెరిగినట్లు వివరించారు.