మారుమూల అటవీ ప్రాంతంలో పుట్టి, పెరిగి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఓ ఆదివాసీ కుర్రాడు ధైర్యంగా ముందడుగు వేశాడు. ఎంతో కష్టతరమైన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలో అర్హత సాధించి, మంచి కాలేజీలో సీటు సాధించాడు. ఒడిశాలోని బోండా తెగకు చెందిన మంగళ ముదులి(19) ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. బెర్హంపూర్లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు. అంతేకాదు ఆ తెగ నుంచి డాక్టర్ కాబోతున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొంది.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ ముదులి కుటుంబం చిన్నతరహా అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటూ జీవిస్తోంది. అతడికి ముగ్గురు తోబుట్టువులు. వారి కుటుంబంలో మొదట ఉన్నత విద్యను అభ్యసించింది తానే అని ముదులి పేర్కొన్నాడు. స్థానిక రెసిడెన్షియల్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశానని, రోజూ ఐదు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ ఆ స్కూల్కు వెళ్లేవాడినని వివరించాడు. అనంతరం ఇంటర్ చదవడానికి తమ గ్రామం నుంచి 25 కి.మీ. వెళ్తూ, ఏకకాలంలో నీట్ కోచింగ్ తీసుకునేవాడినని తెలిపాడు. కోచింగ్ కోసం అతడి స్కూల్ టీచర్ ఆర్థికసాయం చేశారని తెలిపాడు. తమ గూడెంలోని ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు సొంతంగా మూలికా వైద్యం చేసుకోవడంతో ఒక్కోసారి అది వికటించి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం కోసం తాను డాక్టర్ను కావాలనుకుంటున్నానని మీడియాకు తెలిపాడు.