Sunday, December 22, 2024
HomeUncategorizedపార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై హైకోర్టు కీల‌క తీర్పు

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై హైకోర్టు కీల‌క తీర్పు

Date:

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. భారాస, భాజపా నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని భారాస నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్‌ పిటిషన్‌ వేశారు.

దానంపై అనర్హత వేటు వేయాలని బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి హైకోర్టు విచారించగా.. సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్‌ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.