Monday, December 30, 2024
HomeUncategorizedదేశంలో నెల రోజుల్లో 18రైలు ప్ర‌మాదాలు

దేశంలో నెల రోజుల్లో 18రైలు ప్ర‌మాదాలు

Date:

దేశంలో రైలు ప్ర‌మాదాలు, రైలు ప్ర‌యాణీకుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో రైలు ప్రమాదాలకు కుట్ర పన్నుతున్న ఘటనలు గత కొన్ని రోజులుగా పెరిగాయి. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైలు పట్టాలపై సిలిండర్‌ పెట్టి రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు యత్నించారు. ఈ ఘటన మరవక ముందే అలాంటి ఘటనే ఇవాళ మరొకటి చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలిసింది. పూలేరా – అహ్మదాబాద్‌ రూట్‌లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్‌ దిమ్మెను ఉంచారు. రైలు దాన్ని ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ క్రమంలో వరుస రైలు ప్రమాదాలపై భారతీయ రైల్వే తాజాగా స్పందించింది. గత నెల ఆగస్టు నుంచి ఈ నెల 8వ తేదీ వరకూ 18 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో అజ్మీర్‌లో ఆదివారం ఒక్కరోజే రెండు ఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది.

రైళ్లను పట్టాలు తప్పించేందుకే ఈ కుట్రలు జరిగాయని పేర్కొంది. ఈ 18 ఘటనల్లో 15 ప్రమాదాలు ఆగస్టులో జరగ్గా.. మరో మూడు ఈ నెల (సెప్టెంబర్‌లో) జరిగినట్లు వివరించింది. రైలు ట్రాక్‌లపై వివిధ రకాల వస్తువులను అధికారులు గుర్తించినట్లు తెలిపింది. వీటిలో ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ట్రాక్టర్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్‌ దిమ్మెలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోనే వెలుగు చూసినట్లు తెలిపింది. ఆ తర్వాత పంజాబ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు జరిగినట్లు వివరించింది. ఇక జూన్‌ 2023 నుంచి ఇప్పటి వరకూ ఈ తరహా ఘటనలు 24 జరిగినట్లు తెలిపింది.