ఛత్తీస్‌గఢ్ దంతెవాడ-బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఉదయం 10.30 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 29న నారాయణపుర్ జిల్లా అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. తాజా ఘటనతో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 154 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు వెల్లడించారు.