Sunday, December 22, 2024
HomeUncategorizedఒలింపిక్స్‌లో చేజారిన మ‌నుబాక‌ర్ మూడో ప‌త‌కం

ఒలింపిక్స్‌లో చేజారిన మ‌నుబాక‌ర్ మూడో ప‌త‌కం

Date:

పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్‌ మను బాకర్‌కు మూడో పతకాన్ని చేజారింది. 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో కొద్దిలో పతకంపై గురి తప్పింది. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఆమె ఈ ఒలింపిక్స్‌ను రెండు పతకాలతో ముగించింది. మను బాకర్‌ తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మూడో పతకం చేజారిన అనంతరం మాట్లాడిన మను బాకర్ తన తల్లికి భావోద్వేగపూరిత సందేశాన్ని పంపింది. ”నా కోసం అన్నింటిని త్యాగం చేసిన అమ్మకు ధన్యవాదాలు. నీ సహకారంతో ఎన్నో చీకట్లను చీల్చుకుంటూ బయటకు రాగలిగాను. అమ్మా.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. వీలైనన్ని సంవత్సరాలు నాతో ఉండాలి” అని మను బాకర్‌ పేర్కొంది.

త్రుటిలో పతకం చేజారినందుకు ఎంతో నిరాశ చెందానని మను బాకర్ అన్నారు. ”ఈ ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచినందుకు నిరాశగా ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించాను. కానీ, అది సరిపోలేదు. మొత్తం మీద ఈ ఒలింపిక్స్‌లో మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చా. వచ్చే ఒలింపిక్స్‌ కోసం ఎదురుచూస్తున్నా. రెండు పతకాలు సాధించినందుకు ఆనందంగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. నా ఫోన్‌ని చెక్‌ చేయడం లేదు. కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ, నా వంతుగా మంచి ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తున్నానని తెలుసు. ఈ ఒలింపిక్స్‌లో నేను పతకాలు సాధించడం వెనక కోచ్‌లు, ఇతర సిబ్బంది కృషి ఎంతో ఉంది. వారు చాలా కష్టపడ్డారు. టీమ్‌ మొత్తం మద్దతుగా నిలిచారు” అని పేర్కొన్నారు.