బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కళింగపట్నం ఒడిశాలోని గోపాలపూర్ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమై ఉందని రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండం గా బలపడి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీరాల్లో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ జిల్లాలలో అతి భారీ, భారీ వర్షాలు
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, పెద్దపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన
అతి భారీ వర్షాలు, భారీ వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో కూడా ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షపాతం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రేపటి నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలలో రేపటి నుండి మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాదులోనూ రెండు రోజులపాటు ఒక మోస్తరు వర్షపాతం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.