Wednesday, October 30, 2024
Homeతెలంగాణహైడ్రాకు విస్తృత అధికారాలు చ‌ట్ట‌విరుద్ధం

హైడ్రాకు విస్తృత అధికారాలు చ‌ట్ట‌విరుద్ధం

Date:

తెలంగాణ హైకోర్టులో ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌పై పిల్‌ దాఖలైంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని మాజీ కార్పొరేటర్‌ మంచిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైడ్రా ఆర్డినెన్స్‌ సస్పెన్షన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎస్‌, సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఇటీవల రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్‌ రక్షణగా ఉండనుంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినపుడు ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపకశాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ తదితర లక్ష్యాలతో జులై 19న జీవో ఎం.ఎస్‌.నం.99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలో చేర్చింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా, ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలకమైన అధికారాలు హైడ్రాకు దాఖలుపడ్డాయి.