15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedవ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

Date:

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరదల వల్ల సుమారు 5,438 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు వివరించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కోరారు. సచివాలయంలో కేంద్ర మంత్రికి వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకూ అదే స్థాయిలో చేయాలని, రెండు రాష్ట్రాలనూ ఒకే విధంగా చూడాలని సీఎం కోరారు. పలు జిల్లాల్లో ఒక్క రోజే 40 సెం.మీ వర్షంకురిసిందని, వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చెప్పారు. రహదారులు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. రాకపోకలు స్తంభించాయని సీఎం తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని.. పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని వివరించారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.10వేలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.