Tuesday, November 19, 2024
Homeతెలంగాణవ‌రంగ‌ల్ రూపురేఖ‌లు మార‌నున్నాయి

వ‌రంగ‌ల్ రూపురేఖ‌లు మార‌నున్నాయి

Date:

తెలంగాణ‌కే త‌ల‌మానికంగా వ‌రంగ‌ల్‌ను అభివృద్ది చేస్తామని, వరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌ జిల్లా మంత్రి, ఇన్‌ఛార్జ్‌ మంత్రి పట్టుబట్టి అభివృద్ధి పనులను సాధించుకున్నారని చెప్పారు. ఏడాది పాలన పూర్తి సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. విమానాశ్రయంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయన్నారు. చాలా రాష్ట్రాల్లో నాలుగైదు విమానాశ్రయాలు ఉన్నాయని.. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఒకేఒక ఎయిర్‌పోర్టు ఉందన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే పనులు చేస్తుంటే కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

దుర్బుద్ధితో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకున్నారని.. తమను దీవించి పదవులిచ్చిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. గత ప్రభుత్వంలో కొన్నేళ్లపాటు మహిళా మంత్రి కూడా లేరని గుర్తు చేశారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్లపాటు మనసొప్పలేదని, ఎంతో పట్టుదలతో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశామన్నారు. ”వరంగల్‌ గడ్డ నుంచి రైతులందరికీ మరోసారి మాట ఇస్తున్నా. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రూ.2లక్షలలోపు రుణమాఫీ వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తాం” అని సీఎం ప్రకటించారు. వ‌రంగల్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. డిజిటల్‌ విధానంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. కాళోజీ జీవిత విశేషాలను తెలిపేలా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో ప్రదర్శనను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు తిలకించారు. కళాక్షేత్రం ముందు ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.