Wednesday, October 30, 2024
Homeతెలంగాణభూములు బ‌దిలీ చేయ‌మ‌ని ఎవ‌రు చెప్పారు..?

భూములు బ‌దిలీ చేయ‌మ‌ని ఎవ‌రు చెప్పారు..?

Date:

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్‌ భూముల బదిలీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆమోయ్‌ కుమార్‌ విచారించారు. శుక్రవారం ఉదయం 6గంటలకే అమోయ్‌ కుమార్‌ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 9 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. 42 ఎకరాల భూమి బదిలీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. విచారణలో భాగంగా అమోయ్‌ను ఈడీ అధికారులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు తీసుకెళ్లి… తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఈడీకి ఫిర్యాదు చేసిన మధురానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు

ఎవరి ప్రమేయంతో భూములు బదిలీ చేశారు? బదిలీ చేయమని ఎవరైనా ఆదేశించారా? తదితర కోణాల్లో అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేశారు. మరో వైపు తట్టి అన్నారం… మధురానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం సభ్యలు అమోయ్‌కుమార్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారు. మధురానగర్‌లోని 104 ఎకరాలు భూమి ప్లాట్లు వేయగా, తాము ప్లాట్లను కొనుగోలు చేశామని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో అమోయ్‌కుమార్‌ తమ భూములను ధరణి వచ్చాక రికార్డుల్లో తారుమారు చేసి ఇతరులకు అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. గతంలో ఈ విషయమై తాము పోరాటం చేశామని, ఆందోళనలకు సైతం దిగామని తెలిపారు. ఈ విషయంలో అమోయ్‌కుమార్‌పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఈడీకి ఫిర్యాదు చేశారు.